చైనా దొంగ దెబ్బ.. విక్టరీ పరేడ్ కు ముఖ్య అతిథిగా పాక్ ప్రధాని.. మోదీకి నో ఎంట్రీ..

చైనా, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. సెప్టెంబర్ 3 న అట్టహాసంగా జరగనున్న చైనా విక్టరీ పరేడ్ సంబరాలకు ముఖ్య అతిథిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను ఆహ్వానించింది చైనా. పాకిస్థాన్ తో పాటు 26 దేశాలకు చెందిన దేశాధినేతలను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానించినట్లు చైనా విదేశాంగశాఖ సహాయమంత్రి హాంగ్ లీ స్పష్టం చేశారు. ఈ లిస్టులో రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధినేత కిమ్ కూడా ఉన్నట్లు తెలిపారు.


సెప్టెంబర్ 3, 2025న చైనా 80 వ విక్టరీ పరేడ్ కు సిద్ధమవుతోంది. జపాన్ సైన్యంపై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా ఈ సంబరాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది 80వ విక్టరీ పరేడ్ జరగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా 26 దేశాలకు చెందిన అధినేతలకు ఆహ్వానం అందింది. వీరిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ షర్మ ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఇతర సరిహద్దు దేశాల నేతలు ఉన్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం. ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన చైనా విక్టరీ పరేడ్ కు హాజరుకారని భావించవచ్చు.

అయితే అదే వారం చైనాలో జరగనున్న షాంఘై సహకార సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ సహా 20 దేశాల నేతలు పాల్గొంటారని చైనా ఇటీవల వెల్లడించింది. SCO సదస్సు ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్​1న ముగుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. అలాగే SCO చరిత్రలోనే అత్యంత భారీగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ సహాయ మంత్రి ల్యూ బిన్ ఇటీవల తెలిపారు. ఇక ప్రధాని మోదీ 2018లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత సంవత్సరం చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​భారత్​పర్యటనకు వచ్చారు. అయితే 2020లో లద్ధాఖ్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో భారత్​, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.