సాహిత్యసేవ అనేది జీవితాన్ని పరమార్థముగా మార్చుకునే ఒక విశిష్ట సాధన. అక్షరాలను ఆయుధంగా, భావాలను బలంగా, సమాజాన్ని దారితీసే శక్తిగా మార్చుకోగలిగిన వ్యక్తులే నిజమైన సాహితీవేత్తలు. అలాంటి సాహిత్యసేవకురాళ్లలో
సయ్యద్ నజ్మా షమ్మి పేరు ఒక వెలుగొందే నక్షత్రంలా నిలిచింది. ఆమె గృహిణి గానే కాకుండా రచయిత్రి, కవయిత్రి, చిత్రకారిణి, సమా జాన్ని సంస్కరించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న సాహిత్య యోధురాలు. కుటుంబ బాధ్యతల నడుమ కూడా సాహిత్యరంగంలో ఆమె సాధించిన విజయాలు ఎన్నో..ఎన్నెన్నో..
అనంతపురం జిల్లా కదిరిలో 1975 జూన్ 5న జన్మించిన నజ్మా షమ్మి చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆకర్షితురాలై పెరిగింది. పదోతరగతి వరకు చదివిన నజ్మాకుతొలి గురువు తల్లే. అమ్మ ఖైరున్నిసా కవయిత్రి, రచయిత్రి, ఉపాధ్యాయురాలు. తల్లిదండ్రుల ప్రేరణతోనే సాహిత్య రచనలో అడుగుపెట్టిన నజ్మా షమ్మి చిన్ననాటి అనుభవాలను, కుటుంబ సంబంధాలను, సామాజిక వాస్తవాలను పదాల్లో మలచడం ప్రారంభిం చింది. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఒక అందమైన సమన్వయం. భర్త సయ్యద్ షమ్మి పోలీస్ శాఖలో సబ్‌మెరైన్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తూ సమాజసేవలో భాగమవుతుంటే, ఇద్దరు కుమారులు తమ తమ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ అమీర్ సోహైల్ వైద్యరంగంలో, చిన్న కుమారుడు అమీర్ సల్మాన్ సాఫ్ట్‌వేర్ రంగంలో తమదైన స్థానం సంపాదించారు.
అయితే కుటుంబ బాధ్యతల మధ్యే నజ్మా షమ్మి తన హృదయంలోని సృజనాత్మకతను అణిచిపెట్టలేదు. ఆమె రాసిన కథలు, నవలలు, కవితలు అన్నీ జీవితాన్నే ప్రతిబింబించేవి. ఇప్పటి వరకు ఎనభైకు పైగా కథలు, రెండు నవలలు, యాభైకి పైగా కవితలు ఆమె సృష్టి. ‘20 పెన్నా కథలు’, ‘మెహెర్ ముస్లిం కథలు’, ‘140 నిజజీవిత కథలు’, ‘శ్రావణ సమీరం’ నవలలు ఆమె సాహిత్యరం గానికి అందించిన రత్నాలు. వీటిలో ప్రతిఒక్కటి సమాజంలోని వాస్తవ పరిస్థితులను, మహిళల జీవన పోరాటాలను, ముస్లిం మహిళలు పర్దా వెనుక ఎదుర్కొనే కష్ట సుఖాలను ప్రతిబింబిస్తాయి. ఆమె రచనల్లో బాంధవ్యాల ప్రాధాన్యత, మానవత్వపు గాఢత, సమానత్వపు స్వరాలు స్పష్టంగా వినిపిస్తాయి.
ఆకాశవాణి విజయవాడ అనుసంధానంగా నెల్లూరు రేడియో స్టేషన్ ద్వారా ఆమె రాసిన కథలు అనేక సార్లు ప్రసారం అయ్యాయి. స్వయంగా ఆమె స్వరంతో వినిపించే ఈ కథలు విన్నవారి మనసులను కదిలించా యి. ఇంకా ఇవాళ కూడా ఆమె కథలు రేడియో ద్వారా ప్రతిధ్వనిస్తూ శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. సాహిత్యానికి తోడు ఆమె చిత్రకళపై కూడా ఆసక్తి కనబరిచారు. పెయింటింగ్, పెన్సిల్ స్కెచ్‌లు, పోట్రెట్లు, తాపీ పని, కుండల తయారీ, కుట్లు, అల్లికలు వంటి అనేక విభిన్న హాబీలను కొనసాగిస్తూ తన సృజనాత్మకతను అన్ని రంగాల్లో వికసింపజేశారు.
మహిళా సాధికారత పట్ల నజ్మా షమ్మి రాసిన రచనలు ప్రత్యేకంగా నిలిచాయి. ముస్లిం మహిళల మనోభావాలు, వారి సామాజిక సమస్యలు, పర్దా వెనుక దాగిన భావోద్వేగాలు ఆమె కథల్లో మసకబారకుండా ఉజ్జ్వలంగా ప్రతిబింబిస్తాయి. సమాజంలో బలహీన వర్గాల సమస్యలను కేవలం బయటపెట్టడమే కాకుండా పరిష్కార దారులు చూపే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆమె సాహిత్యరచనలోని ఈ సామాజిక చైతన్యం ఆమెను ప్రత్యేక రచయిత్రిగా నిలబెట్టింది.
అభినందనలు, అవార్డులు నజ్మా షమ్మిని మరింత ప్రేరేపించాయి. ‘‘మెహెర్’’, ‘‘ఆపా’’, ‘‘నజరానా’’, ‘‘మేనరిక్’’, ‘‘కనువిప్పు’’ వంటి కథలు విస్తృతంగా చర్చకు వచ్చాయి. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అనేక సంస్థలు ఆమెను సన్మానించాయి. విశాఖపట్నం సమైక్య భారతీ భాషా సంస్కృతి సామాజిక సంస్థ, తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ, తిక్కన సాహిత్య పురస్కారం, ఉగాది సాహిత్య పురస్కారం వంటి ఎన్నో గౌరవాలు ఆమె ఖాతాలో చేరాయి. ముఖ్యంగా 2023లో కేంద్ర ప్రభుత్వం తరఫున అందించిన ప్రతిష్ఠాత్మక ‘‘సుష్మా స్వరాజ్ అవార్డు’’ ఆమె సాహిత్య ప్రస్థానంలో మైలురాయిగా నిలిచింది. పురంధరేశ్వరి చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు ఆమెకు గర్వకారణం మాత్రమే కాకుండా తెలుగు సాహిత్యానికి ఒక గౌరవపతాకం.
ఇవి మాత్రమే కాదు, ‘‘శ్రీ శ్రీ కళావేదిక జాతీయ శతాధిక పురస్కారం’’, ‘‘అడవి బాపిరాజు స్మృతిపథం పురస్కారం’’, ‘‘గుడిపాటి సుబ్బారా యుడు కవి సమ్మేళన పురస్కారం’’, ‘‘ప్రకాశం జిల్లా రచయితల సంఘం పురస్కారం’’, ‘‘పినాకిని సత్యాగ్రహం వారి మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కారం’’, ‘‘స్నేహ పరిమళం పురస్కారం’’ లాంటి అనేక అవార్డులు ఆమెను మరింత ప్రోత్సహించాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు రచయితల మహా సభల్లో ఆమెకు లభించిన సన్మానం విశేషం.
అన్ని రంగాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నజ్మా షమ్మి హృదయంలో మాత్రం రెండు గొప్ప ఆశయాలు ఎప్పటికీ మసకబారవు. ఒకటి వృద్ధాశ్రమాన్ని నిర్మించడం. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆశ్రయం కల్పించడమే కాకుండా వారిని గౌరవంగా నిలబెట్టే సదుపాయం కల్పించాలని ఆమె కల. మరొకటి తెలుగు భాషా పరిరక్షణ. భాష అంటే సంస్కృతి, సంస్కృతి అంటే మనసు అని నమ్మే నజ్మా షమ్మి, తెలుగు భాషను మరింత గొప్పదనంగా నిలబెట్టాలని, భవిష్యత్తు తరాలకు దానిని అందించాలని సంకల్పించారు.
మొత్తం మీద సయ్యద్ నజ్మా షమ్మి జీవితం ఒక గాథ. అది కేవలం వ్యక్తిగత విజయాల గాథ కాదుబీ కుటుం బం, సమాజం, సాహిత్యం అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన సృజనాత్మక యాత్ర. గృహిణి నుండి సాహిత్య సప్తగిరి వరకూ చేసిన ఈ ప్రయాణం రాబోయే తరాలకు ఒక స్ఫూర్తి. అక్షరాల కాంతితో సమాజాన్ని వెలిగించాలన్న ఆమె తపన ప్రతి తెలుగు మనసునూ గర్వపడేలా చేస్తుంది.