అమరావతి-నవభూమి ప్రతినిధిఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా వెలుగుచూసిన అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా ప్రారంభించిన **డిజిటల్ బుక్ యాప్‌లో మాజీ మంత్రి విడదల రజిని పై ఫిర్యాదు** నమోదైంది.
ఈ ఫిర్యాదు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇల్లు, కారు, పార్టీ కార్యాలయంపై విడదల రజిని దాడి చేయించారనే ఆరోపణలు చేశారు. తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన డిజిటల్ బుక్ ద్వారా కోరారు. ఫిర్యాదు నమోదు అనంతరం వచ్చిన టికెట్‌ను ఆయన మీడియాకు చూపించారు.
విడదల రజిని స్వయంగా చిలకలూరిపేటలో ఈ డిజిటల్ బుక్ యాప్‌ను ఆవిష్కరించడం, ఆవిష్కరణ జరిగిన కొద్దిసేపటికే తనపై ఫిర్యాదు రావడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై హల్చల్ జరుగుతోంది. అయితే విడదల రజిని ఇంకా స్పందించలేదు.
జగన్ ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్ ఉద్దేశం వైఎస్సార్సీపీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని నమోదు చేసి, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక బృందాలతో న్యాయం చేయించడమే. కానీ అదే యాప్‌లో సొంత పార్టీ మాజీ మంత్రిపై ఫిర్యాదు రావడం జగన్‌కు పెద్ద సవాలుగా మారింది.రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ బుక్‌లో మరెంతమంది పార్టీ నేతలపై ఫిర్యాదులు నమోదవుతాయో అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జగన్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.