ప్రతి ఏటా గణేశ్ చతుర్థి వచ్చిదంటే చాలు దేశవ్యాప్తంగా వీధివీధినా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. తమకు నచ్చిన ఆకారాల్లో తయారు చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమాల యాక్టర్ల గెటప్ ల్లోనూ వీటిని తయారు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది.
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం అఘాపురాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకారంలో వినాయకుడి(Lord Ganesha) విగ్రహం పెట్టడం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా విగ్రహం పెట్టారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు మండిపడ్డారు.
ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో విగ్రహం పెట్టిన మండపాన్ని సౌత్ వెస్ట్ డీసీపీ సందర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని నిర్వాహకుడు సాయికుమార్ ను సున్నితంగా హెచ్చరించారు. అనంతరం విగ్రహం తీసేయాలని ఆదేశించారు. పోలీసులు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకుడు సాయికుమార్.
కాగా, ప్రతి ఏటా గణేశ్ చతుర్థి వచ్చిదంటే చాలు దేశవ్యాప్తంగా వీధివీధినా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. తమకు నచ్చిన ఆకారాల్లో తయారు చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమా యాక్టర్ల గెటప్ ల్లోనూ వీటిని తయారు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల వేషధారణలోనూ వాటిని తయారు చేస్తున్నారు. అయితే, ఇది కొంతమంది భక్తులకు మింగుడు పడడం లేదు. వ్యక్తుల మీద అభిమానం ఉంటే వారిని అభిమానించాలే కాని, దేవతలకు వారి రూపాలను ఆపాదించి అవమానించవద్దని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.