వర్షాకాలం వచ్చిందంటే చాలు. డెంగ్యూ దోమలు విజృంభిస్తాయి. ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వైరల్ ఫీవర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి, డెంగ్యూ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించాల్సిందేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రతి సంవత్సరం, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య డెంగ్యూ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఈ విషజ్వరాల ధాటికి మంచం ఎక్కేస్తుంటారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, మురికి కాలువలు మూసుకుపోవడం, నిలిచి ఉన్న నీరు, అధిక తేమ ఈడిస్ దోమల సంతానోత్పత్తికి స్థావరాలుగా మారతాయి. ప్రభుత్వం ఏటా డెంగ్యూ నివారణ కోసం ప్రత్యేక ప్రజారోగ్య కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ వైరల్ ఫీవర్ జనాలను బెంబేలెత్తిస్తూనే ఉంది. కనీసం ఈ సీజన్లో అయినా డెంగ్యూ దోమ కాటు నుంచి సురక్షితంగా ఉండాలంటే పాటించాల్సిన నివారణ చర్యలు తెలుసుకోండి.
ఫ్లేవీ విరస్ కుటుంబానికి చెందిన నాలుగు విభిన్న రకాల వైరస్‌లు డెంగ్యూ జ్వరాన్ని కలిగిస్తాయి. ఈ వైరస్‌లు ప్రధానంగా ఆడ ఈడిస్ ఈజిప్టై దోమల కాటుతో ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత ఆ రకం వైరస్‌పై శరీరానికి రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. అదే రకం మళ్లీ దాడి చేయదు. కానీ మిగతా మూడు రకాల వైరస్‌లతో మాత్రం ఇంకా మూడు సార్లు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకరికి జీవితంలో గరిష్ఠంగా నాలుగు సార్లు డెంగ్యూ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా, రెండోసారి లేదా మూడోసారి వ్యాధి సోకితే అది పూర్తిగా భిన్నమైన వైరస్ వల్ల రావడం వల్ల జ్వరం తీవ్రతరం కావచ్చు.