రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఇవాళ(గురువారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. ఈరోజు నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.

ఉల్లికి రేటు వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతోపాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.