రష్యా చమురు కొంటూ ఉక్రెయిన్ తో యుద్ధంలో ఆ దేశానికి సాయం చేస్తున్నారన్న కారణం చూపుతూ భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రంప్ తీరుపై స్వదేశంలో ప్రత్యర్ధి పార్టీ డెమోక్రాట్లతో పాటు ఆర్దిక వేత్తలు, చివరికి ఆయన మాజీ సలహాదారులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పేరు చెప్పి భారత్ పై సుంకాలు విధించడం ఏంటనే చర్చను వారు తెరపైకి తెస్తున్నారు.
రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో ఒకటైన చైనాను వదిలేసి.. భారత్ ను ట్రంప్ టార్గెట్ చేయడంపై స్వదేశంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశాన్ని అన్యాయంగా 50 శాతం సుంకాలతో ఒంటరిని చేసే ప్రయత్నం చేయడంపై యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలోని డెమొక్రాట్లు విమర్శలకు దిగారు. చైనాపై లేదా ఎక్కువ మొత్తంలో రష్యన్ చమురును కొనుగోలు చేసే ఇతరులపై ఆంక్షలు విధించే బదులు, ట్రంప్ భారతదేశాన్ని సుంకాలతో ఒంటరిని చేస్తున్నారని ప్యానెల్ డెమొక్రాట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు.