ఆదిత్య-ఎల్1 - సూర్యుడిపై భారత్ విజయగాథ

చరిత్రలో కొన్ని క్షణాలు కేవలం గడిచిన సమయాన్ని మాత్రమే సూచించవు, అవి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. 2023వ సంవత్సరం భారతదేశానికి అలాంటి క్షణాలనే అందించింది. చంద్రుడిపై మన చంద్రయాన్-3 అడుగుపెట్టినప్పుడు దేశం మొత్తం గర్వంతో పులకించిపోయింది. ఆ ఉత్సాహం ఇంకా కొనసాగుతుండగానే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అదే ఆదిత్య-ఎల్1 మిషన్. ఈ మిషన్ కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, ఇది ఒక దేశం తన సామర్థ్యాలను పూర్తిస్థాయిలో విశ్వసించినప్పుడు ఏం సాధించగలదో ప్రపంచానికి నిరూపించిన ఒక చరిత్రాత్మక ఘట్టం. ఈ విజయాలు, భారతదేశం ఇకపై కేవలం ఒక కలలు కనే దేశం కాదని, వాటిని నిజం చేసుకోగల సత్తా ఉన్న దేశమని చాటిచెప్పాయి.


​సూర్యుడి రహస్యాలను ఛేదించడానికి ఆదిత్య-ఎల్1:

​సూర్యుడు మన సౌర వ్యవస్థకు శక్తినిచ్చే ప్రధాన మూలం. కానీ, మనం రోజూ చూసే ఈ ప్రకాశవంతమైన నక్షత్రం గురించి మనకు ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 6,000 డిగ్రీల సెల్సియస్ అయితే దాని బాహ్య వాతావరణం అంటే కరోనా ఉష్ణోగ్రత మాత్రం లక్షల డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉంటుంది. ఇది ఎలా సాధ్యమనేది దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న ఒక పెద్ద మిస్టరీ. ​అంతేకాకుండా సూర్యుడి నుంచి అప్పుడప్పుడు భారీగా వేడి గాలులు, విద్యుత్ అయస్కాంత కణాలు, సౌర తుఫానులు వస్తాయి. వీటిని కరోనల్ మాస్ ఎజెక్షన్లు - సిఎంఈలు అంటారు. ఇవి భూమిని చేరినప్పుడు, మన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, టివి., రేడియో, జిపిఎస్. సిగ్నల్స్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. 1989లో కెనడాలో ఒక సౌర తుఫాను వల్ల భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి, ఈ సౌర తుఫానులను ముందుగానే తెలుసుకోవడం, వాటి ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అందుకే ఇస్రో ఈ ప్రత్యేకమైన ఆదిత్య-ఎల్1 మిషన్‌ను చేపట్టింది. ​ఆదిత్య-ఎల్1 ప్రయాణం, లాగ్రాంజ్ పాయింట్ ​ఈ మిషన్ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది.2 సెప్టెంబర్ 2023న, ఆదిత్య-ఎల్1ను మన స్వదేశీ రాకెట్ పిఎస్ఎల్వి - సి57 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం భూమి చుట్టూ కొన్ని కక్ష్యలలో తిరిగిన తర్వాత దాని వేగాన్ని పెంచడానికి, భూమి గురుత్వాకర్షణ క్షేత్రం నుంచి బయటపడటానికి దశలవారీగా థ్రస్టర్‌లను మండించడం జరిగింది. సుమారు 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇది జనవరి 6న తన లక్ష్య స్థానమైన లాగ్రాంజ్ పాయింట్ 1(ఎల్1)కి చేరుకుంది. ​లాగ్రాంజ్ పాయింట్ అనేది అంతరిక్షంలో ఒక అసాధారణ ప్రదేశం. ఇది భూమికి దాదాపు 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ బలాలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఫలితంగా ఉపగ్రహం ఇంధనం తక్కువగా ఖర్చు చేస్తూ, ఒక స్థిరమైన కక్ష్యలో తిరగగలదు. ఈ ప్రత్యేకమైన స్థానం నుంచి, ఉపగ్రహం సూర్య గ్రహణాలు లేదా ఇతర అంతరిక్ష వస్తువులు అడ్డుపడకుండా సూర్యుడిని 24 గంటలు నిరంతరాయంగా గమనించగలుగుతుంది. ఈ నిరంతర వీక్షణ సూర్యుడి ప్రవర్తనలోని సూక్ష్మ మార్పులను సైతం గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.


మిషన్ పరికరాలు:

అతినీలలోహిత కాంతి తరంగదైర్ఘ్యాలలో తీసే

సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్యుఐటి), భూమిపై అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేసే సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలులను, వాటిలోని రేణువులను అధ్యయనం చేసే ​ఏఎస్పిఈఎక్స్ అండ్ పిఎపిఎ పరికరాలు, సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్-రేలను కొలిచి, సౌర మంటల గురించి సమాచారం ఇచ్చే ​ఎస్ఓఎల్ఈఎక్స్ అండ్ హెచ్ఈఎల్1ఓ.ఎస్, ఎల్1 పాయింట్ వద్ద ఉన్న అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పులను కొలిచే మాగ్నెటోమీటర్ లాంటి పేలోడ్లు ఉన్నాయి. ఇవి ఒక టీమ్‌లాగా పనిచేసి సూర్యుడి గురించి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను బయటపెడతాయి.​


పరిశోధనా ఫలితాలు - దాని ప్రాముఖ్యత:

​ఆదిత్య-ఎల్1 సేకరించిన డేటా ఇప్పటికే ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. విఇఎల్సి నుంచి వచ్చిన మొదటి డేటా ఆధారంగా భారతీయ పరిశోధకులు 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్'లో ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. ఆ పత్రంలో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.


​కరోనల్ డిమ్మింగ్:

జూలై 2024లో సంభవించిన ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ (సిఎంఈ) సమయంలో ఆ ప్రాంతంలో కరోనా కాంతి దాదాపు 50% తగ్గిపోయినట్లు గమనించారు. ఇది ఆ ప్లాస్మా, వేడి గాలులు వేగంగా అంతరిక్షంలోకి వెళ్తున్నాయని స్పష్టంగా చూపిస్తుంది.


​ఉష్ణోగ్రత, అల్లకల్లోలం పెరుగుదల: 

ఈసిఎంఈ. సమయంలో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత అసాధారణంగా పెరిగినట్లు గుర్తించారు.


​ప్లాస్మా విచలనం: 

సూర్యుడి నుంచి బయలుదేరిన ప్లాస్మా మన భూమి వైపు కాకుండా సూర్యుడి అయస్కాంత క్షేత్రాల వల్ల పక్కకు వెళ్లిపోయిందని కనుగొన్నారు. ఈ సమాచారం భవిష్యత్తులో సౌర తుఫానులు ఎటువైపు వెళ్తాయో అంచనా వేయడానికి చాలా ముఖ్యమైనది.

​ఈ పరిశోధనలు కేవలం శాస్త్రీయ ఆవిష్కరణలు మాత్రమే కాదు. మన భూమిపై ఉన్న సాంకేతికతను కాపాడుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. సౌర తుఫానులు రాకముందే మనకు హెచ్చరికలు లభిస్తే మన ఉపగ్రహాలను, విద్యుత్ గ్రిడ్‌లను సురక్షితంగా ఉంచగలం.

ఆత్మవిశ్వాసం- ఆత్మనిర్భరతకు చిహ్నం:

​ఆదిత్య-ఎల్1 మిషన్ అనేది కేవలం ఒక అంతరిక్ష విజయం మాత్రమే కాదు. ఇది ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశ స్థానాన్ని పదిలం చేసింది. గతంలో అమెరికా, యూరప్, జపాన్ వంటి కొన్ని దేశాలు మాత్రమే సాధించగలిగిన ఇలాంటి క్లిష్టమైన మిషన్లను భారతదేశం విజయవంతంగా పూర్తి చేయడం మన సాంకేతిక సామర్థ్యానికి, శాస్త్రవేత్తల నిబద్ధతకు నిదర్శనం.

​ఈ విజయం మన యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు ఒక బలమైన ప్రేరణ. ఇది అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచి, భవిష్యత్ తరాలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆదిత్య-ఎల్1 ద్వారా లభించే ప్రతి చిన్న సమాచారం, మన అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి, మన ఉపగ్రహాలను, సాంకేతిక వ్యవస్థలను సౌర తుఫానుల వంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ​ఆదిత్య-ఎల్1 భారతదేశ ప్రగతికి, స్వయం సమృద్ధికి ఒక గొప్ప ఉదాహరణ. ఇది కేవలం సూర్యుడిని చూడటం కాదు, మన భవిష్యత్తును చూడటం. అసాధ్యం అనిపించిన కలలను నిజం చేసుకోవడం.


జనక మోహన రావు దుంగ

8247045230