- రూ.42 వేల నుంచి రూ.7 లక్షల వరకు విక్రయం
- నిందితుల వద్ద నుంచి రూ.5 లక్షలు స్వాధీనం
శేరిలింగంపల్లి ప్రతినిధి-నవభూమి, సెప్టెంబర్ 1: చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించిన ముఠాను చందానగర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు చిన్నారులను రక్షించి నలుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆచూకీ దొరకని ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాపాడిన చిన్నారులను సంరక్షణ కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారికి అప్పగించారు. సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ జోన్ డిసిపి డాక్టర్ వినీత్ జి. కేసు వివరాలు వెల్లడించారు.
పటాన్ చెరులో ఆయుర్వేద స్టోర్ నిర్వహిస్తున్న చిలుకూరి రాజు, కూరగాయల వ్యాపారి మహమ్మద్ ఆసిఫ్, బాలరాజు, సిద్దిపేటలో క్లినిక్ నిర్వహిస్తున్న రిజ్వాన, మూసాపేటకు చెందిన కూలీ నర్సింహారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. చిలుకూరి రాజు నాలుగేళ్ల క్రితం కాచిగూడ రైల్వే స్టేషనులో బాలికను కిడ్నాప్ చేసి రూ.42 వేలకు అమ్మేశాడు. అనంతరం ప్రియా (1), ఆద్విక్ (2), లాస్య (5), అరుణ్ (2), అఖిల్ (5), 8 నెలల బాలిక అమ్ములును కిడ్నాప్ చేసి విక్రయించారు.
ఆగస్టు 26వ తేదీన లింగంపల్లిలోని పోచమ్మ గుడి వద్ద గుడిసెలో నివసిస్తున్న అఖిల్ అదృశ్యమయ్యాడు. బాలుడి తల్లి చందానగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఇన్స్పెక్టర్ ఎస్.విజయ్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందానగర్ డిఐ కె.భాస్కర్, డిఎస్ఐ ఎం.నరసింహారెడ్డి, క్రైమ్ విభాగం కానిస్టేబుళ్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అఖిల్ ను కిడ్నాప్ చేసి రూ.7 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పిల్లల అపహరణ మూట గుర్తు రట్టయింది. లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో నివసించే వలస కార్మికులను టార్గెట్ చేసుకొని రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. రాజు కిడ్నాప్ చేసి ఆసిఫ్ కు అప్పగించడంతో రిజ్వానా ద్వారా పిల్లలు లేని తల్లిదండ్రులను గుర్తించి విక్రయించినట్టు దర్యాప్తులో వెళ్లడైంది. నిందితులు చిలుకూరి రాజు, ఎండి ఆసిఫ్, రిజ్వాన, నరసింహారెడ్డిలను అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పర్యవేక్షణలో మాదాపూర్ జోన్ డిసిపి డాక్టర్ జి.వినీత్ నేతృత్వంలో మియాపూర్ ఎసిపి సిహెచ్.వై. శ్రీనివాస్ కుమార్, చందానగర్ ఇన్స్పెక్టర్ ఎస్.విజయ్ డిఐ కె.భాస్కర్ ఆధ్వర్యంలో కిడ్నాప్ కేసును ఛేదించారని పేర్కొన్నారు. ఈ చిన్నారుల కిడ్నాప్ గ్యాంగ్ పట్టివేతలో కీలక పాత్ర పోషించిన చందానగర్ డిఎస్ఐ ఎం.నరసింహా రెడ్డి, ఎఎస్ఐ వనమాల, క్రైమ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రెడ్డి, విఠల్, ఇతర కానిస్టేబుళ్లను డిసిపి అభినందించారు.