కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ – కేసీఆర్, హరీష్‌రావుకి తాత్కాలిక ఉపశమనం

హైదరాబాద్ సెప్టెంబర్ 2 (నవభూమి ప్రతినిధి):

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), మాజీ మంత్రి టి. హరీష్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇద్దరూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో, అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన విషయమేమిటంటే— కాళేశ్వరం నివేదికపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చ జరిగినదని, కేసును సీబీఐ విచారణకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని. ప్రస్తుతం కేసీఆర్, హరీష్‌రావులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

కోర్టు ముందు వాదనలు వినిపించిన అనంతరం, సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావుకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది.కేసు తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.