కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం, వరద నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఊహించిన దానికి కంటే పోచారం ప్రాజెక్టు పైనుంచి నీరు ధాటిగా ప్రవహిస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్ట్ పక్కన గుంతపడటంతో ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా గజగజ వణికిపోయారు. కానీ ఈ ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు అంతటి వరదను సైతం తట్టుకుని ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోనే.. నిజాం కాలంలో నిర్మించిన పురాతన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్ట్ ఒకటి. ఇది సంభవించిన భారీ వరద ప్రవాహాన్ని విజయవంతంగా తట్టుకుని నిలిచింది. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం (MFD) 70,000 క్యూసెక్కులు మాత్రమే అయినప్పటికీ, ఇటీవల వచ్చిన 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను ఇది తట్టుకోగలిగింది. ఈ అపారమైన ఒత్తిడిని సైతం తట్టుకొని ప్రాజెక్ట్ సురక్షితంగా ఉండటం నీటిపారుదల నిపుణులకు, ప్రభుత్వ వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఒక శతాబ్దానికి పైగా బలంగా నిలబడిన ఈ కట్టడం, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.
పోచారం ప్రాజెక్ట్ చారిత్రక, సాంకేతిక వివరాలు నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టులలో ఒకటిగా పోచారం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయింది. దీని నిర్మాణం 1917లో ప్రారంభమై, 1922లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి విలువ ప్రకారం రూ. 27.11 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం, పోచారం గ్రామంలో ఉన్న మంచిప్ప చెరువుపై నిర్మించారు. దీని అసలు సామర్థ్యం 2.423 టీఎంసీలు. అయితే, కాలక్రమేణా పూడిక కారణంగా దాని ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గింది. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాలకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. దీని కింద మొత్తం 10,500 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తోంది.
