
పటియాలా, సెప్టెంబర్ 2 (నవభూమి ప్రతినిధి):పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే హర్మీత్‌సింగ్ ధిల్లాన్‌పై అత్యాచారం, మోసం ఆరోపణలు నమోదు కావడంతో మంగళవారం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, కర్నాల్‌లో అరెస్టయిన హర్మీత్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అకస్మాత్తుగా అధికారులపై కాల్పులు జరిపి, అక్కడే సిద్ధంగా ఉన్న వాహనాల్లో పరారయ్యారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది.
జిరాక్పూర్‌కు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్మీత్‌పై కేసు నమోదైంది. విడాకులు పొందిన తాను మోసపూరితంగా పెళ్లి వాగ్దానం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అనంతరం బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు హర్మీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, పోలీసుల వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్తుండగా హర్మీత్ సహచరులతో కలిసి కాల్పులు జరిపి తప్పించుకోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఆరోపణలను ధిల్లాన్ తీవ్రంగా ఖండించారు. అరెస్టుకు ముందు ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, ఇవన్నీ తనపై రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. వరదల సమస్యను ఎదుర్కోవడంలో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఢిల్లీ నేతృత్వంలోని ఆప్ చట్టవిరుద్ధంగా పంజాబ్‌ను పాలిస్తోందని ధిల్లాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన గొంతును నొక్కివేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు వస్తున్నాయని ధిల్లాన్ పేర్కొన్నారు.