అమరావతి, సెప్టెంబర్ 2 (నవభూమి ప్రతినిధి):రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు వెలువడతాయని ఆయన స్పష్టం చేశారు. వీటి ద్వారా వివిధ శాఖల్లో దాదాపు 80 పోస్టులు భర్తీ కానున్నాయి.ఇక అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 691, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 100 భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 7న రెండు సెషన్లలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లలో వివరాలు తప్పులేకుండా నమోదు చేయాలని సూచించారు. ఒకసారి రాసిన సమాధానాలను చెరిపివేస్తే ఆ పేపర్లను చెల్లుబాటు కానివిగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక మైనస్ మార్కు వర్తిస్తుందని తెలిపారు.స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా శాప్ నుంచి రాకపోవడంతో గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు నిలిచిపోయాయని, అయితే మిగిలిన పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయిందని రాజాబాబు వివరించారు.
- Home
- Post