
అమరావతి, సెప్టెంబర్ 6 (నవభూమి ప్రతినిధి):లిక్కర్ కేసు విచారణలో రోజురోజుకూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయిన ఈ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో జగన్ ప్రస్తావన ఉండగా, మరొక ఛార్జ్‌షీట్ దాఖలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్రపై సిట్‌కు ముఖ్య ఆధారాలు లభించాయి.
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతినెలా రూ.50 నుంచి 60 కోట్ల వరకు వసూళ్లు జరిపిన వ్యవహారంలో అనిల్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సిట్‌కు సమాచారం అందింది. రిమాండ్ రిపోర్టుల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు అధికారులు. కెసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపుల సొమ్ము ఏ మార్గాల్లో చేరిందన్నది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పీఏ దేవరాజు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు రుజువైంది. మూడు రోజులుగా దేవరాజును సిట్ విచారిస్తోంది. తనకేమీ తెలియదని ఆయన చెప్పినప్పటికీ, సాంకేతిక ఆధారాలు చూపించగానే సమాధానాలు తప్పించుకోలేకపోయినట్లు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని ఇప్పటికే రికార్డు చేశారు.
చెన్నైలో నివసించే అనిల్ రెడ్డి, జగన్‌కు సోదరుడు మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితుడిగా పరిగణింపబడతారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తరఫున అనేక ఆర్థిక వ్యవహారాలను ఆయనే చక్కబెడుతారన్న ప్రచారం ఉంది. జేసీకేసీ, ప్రతిమ సంస్థలను ముందుకు తెచ్చి ఇసుక దందా కూడా నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ రెడ్డి పాత్రపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---