నిర్మల్`నవభూమి ప్రతినిధి:తెలంగాణలో మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆదర్శనగర్ కాలనీలో వినాయకుడి నిమజ్జన సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ముస్లిం మహిళ అమ్రీన్ పాల్గొని, రూ.1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది.
ఇదే కాకుండా, కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలో కూడా మతసౌహార్ద్ర దృశ్యం కనిపించింది. అక్కడ గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఏడవ తరగతి విద్యార్థి రెహమాన్ రూ.1,111 చెల్లించి లడ్డూను గెలుచుకున్నారు.
మతసామరస్యానికి మరో ఉదాహరణగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామంలో ముస్లింలు మసీదులో వినాయకుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. 1980లో మొదలైన ఈ సంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగుతూ, హిందూ–ముస్లిం సమాజాలు ఉమ్మడిగా పాల్గొంటున్నాయి. ఈ ఘటనలు మత భేదాలను అధిగమించి, సామరస్యంతో జీవించాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నాయి.
