ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ఆ యువతి రేయి, పగలు కష్టపడి చదివింది. తాను గవర్నమెంట్ టీచర్ అయితే తన భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవడం మాత్మే కాకుండా.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని ఆశపడింది. ఏపీ సర్కార్ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించింది. త్వరలోనే ఉద్యోగంలో చేరేందుకు అంతా సిద్ధం కాగా.. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. క్యాన్సర్ మహమ్మారితో ఆ యువతి కన్నుమూయడంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతీ ఒక్కరి కల. అందుకోసం కష్టపడి చదివి.. పోటీ పరీక్షల్లో లక్షల మందితో పోటీ పడి అందులో విజయం సాధిస్తేనే ఉద్యోగం దక్కుతుంది. అయితే ఎంత కష్టపడినా, ఎంత చదివినా.. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే మాత్రం చాలా కష్టమే. ఓ వైపు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం కోసం వాటిని పక్కకు పెట్టి.. చాలీచాలని నిద్ర పోయి.. అహోరాత్రులు శ్రమించి.. గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్ల కథలు విన్నపుడు.. చాలా మంది ప్రభావితమై.. ఆ వైపు పయనిస్తారు. అలాగే ఓ యువతి.. తన చిరకాల కల అయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా.. సెలెక్ట్ అయింది. ఇక చివరికి ఉద్యోగంలో చేరే సమయంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతూ.. ఆ యువతి ఉద్యోగంలో చేరకముందే ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 వేలకుపైగా ఖాళీలతో మెగా డీఎస్సీని ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలె మెరిట్ లిస్ట్‌ను ప్రకటించి.. ఎంపికైన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కూడా పిలిచింది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎం.నాగజ్యోతి అనే యువతి.. మెగా డీఎస్సీలో 74.40 మార్కులు సాధించింది. ఇక ఆ మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. ఆమె ఉద్యోగంలో చేరలేకపోయింది. నాగజ్యోతి గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది.