నేపాల్‌ను గడగడలాడిరచిన గండరగండడు

*కాఠ్మాండు, సెప్టెంబర్ 9 (నవభూమి బ్యూరో):నేపాల్‌లో సోషల్ మీడియాపై విధించిన నిషేధం అక్కడి యువతలో ఆగ్రహాన్ని రగిలించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేసిన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ఊపిరి పోసి, దిశానిర్దేశం ఇచ్చిన పేరు **సుడాన్ గురుంగ్**. కేవలం 36 ఏళ్ల వయసులోనే ప్రభుత్వాన్నే గడగడలాడించిన ఈ యువనేత ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యారు.

‘హామీ నేపాల్’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న సుడాన్ గురుంగ్, పెద్దగా రాజకీయంగా ప్రసిద్ధి చెందలేదు. కానీ సెప్టెంబర్ 4న సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించగానే, యువతలో కలిగిన ఆందోళనకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపారు. “మన నిరసన శాంతియుతంగా ఉండాలి. స్కూల్ యూనిఫామ్‌లలో, చేతిలో పుస్తకాలతో పార్లమెంట్ ముందు చేరుదాం. మన ఆయుధాలు అక్షరాలు, మన డిమాండ్ ప్రజాస్వామ్యం” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు యువతను ఏకం చేసింది.

ఈ పిలుపు దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. వేలాది మంది విద్యార్థులు ఖాట్మాండు వీధుల్లోకి పాఠశాల దుస్తుల్లో, పుస్తకాలతో రావడం కేవలం ప్రభుత్వానికే కాదు, అంతర్జాతీయ సమాజానికీ గట్టి సందేశం ఇచ్చింది. హింసాత్మక మార్గాలను దూరంగా ఉంచి అహింసా పద్ధతిని అనుసరించినందువల్లే ఈ నిరసన అంతర్జాతీయ మద్దతు పొందింది.

సుడాన్ గురుంగ్ నాయకత్వంలో ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియా పునరుద్ధరణకే పరిమితం కాలేదు. రాజకీయ నేతల పిల్లల విలాసవంతమైన జీవనశైలిపై, అవినీతి మీద యువతలో ఉన్న అసంతృప్తి కూడా బహిర్గతమైంది. "సామాన్యుడికి ఇంటర్నెట్ దూరం చేసి, మీ పిల్లలు మాత్రం విదేశాల్లో ప్రజాధనంతో సుఖపడతారా?" అన్న ఆయన ప్రశ్నలు యువతను మరింత రగిలించాయి. దీంతో ‘నెపో కిడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం ఊపందుకుంది.

పోలీసులు కాల్పులు జరిపినా ఆయన శాంతిని పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఆందోళనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. చివరికి ప్రభుత్వం వెనక్కు తగ్గి సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం సుడాన్ గురుంగ్ కేవలం ఒక ఎన్జీవో అధ్యక్షుడు కాదు, యువత ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారు. ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారా? లేదా? అన్నది భవిష్యత్తు నిర్ణయించాలి. కానీ యువత హక్కుల కోసం శాంతియుతంగా ఎలా పోరాడాలో చూపించిన ఆధునిక నాయకుడిగా మాత్రం ఆయన పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.