కాఠ్మాండు, సెప్టెంబర్ 9 నవభూమి:నేపాల్ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధం కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్న వేళ, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆయన దుబాయ్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ అనిశ్చితి, విపక్షాల నిరసనలు, ప్రజల ఆగ్రహం మధ్య ఓలీ విమానం సిద్ధం చేసి, దేశ పరిస్థితుల నుండి తాత్కాలికంగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం నేపాల్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.ఇక సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు మాజీ ప్రధాని ప్రచండ ఇంటిపై దాడి చేశారు. అలాగే ప్రస్తుత మంత్రి ప్రిత్వీ సుబ్బా గురుంగ్ నివాసాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, మరో 400 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 100 మంది వరకు పోలీసులు కూడా ఉన్నారని అధికారిక సమాచారం వెలువడింది.
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా నిరసనలు తగ్గడం లేదు. ప్రజల ఆగ్రహం ఉధృతమవుతుండటంతో రాజకీయ సంక్షోభం మరింత లోతు పడుతోంది. ఈ క్రమంలో ప్రధాని ఓలీ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశంలో కొత్త అనిశ్చితిని రేకెత్తిస్తోంది. ఆయన వెళ్లిపోవడం దేశ రాజకీయాల్లో మరింత గందరగోళానికి దారితీస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది.