హైదరాబాద్, సెప్టెంబర్ 9 నవభూమి:
:తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ, పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనానికి 8 నెలల గడువు ఇచ్చింది. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీకి జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.గత ఏప్రిల్‌లో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. అయితే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి, మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. పేపర్ల రీవాల్యుయేషన్ తర్వాతే ఫలితాలు ప్రకటించాలని, లేదంటే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది.ఈ తీర్పుపై టీజీపీఎస్సీ సమీక్షిస్తోంది. అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న, తుది నియామకాలు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. అదే సమయంలో హైకోర్టు తీర్పుతో న్యాయం దక్కుతుందని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.