
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 (నవభూమి బ్యూరో):ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యుల్లో 767 మంది పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం 98.2గా నమోదైంది. రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మరో 15 ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అనంతరం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఫలితాలు స్పష్టమయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
అంతిమంగా 152 ఓట్ల మెజారిటీతో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.