నవభూమి -కోరుట్ల:దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కగార్” పేరిట కఠిన వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండగా, వందలాదిమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మావోయిస్టు దళాలకు పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే ఈ ఒత్తిళ్ల నడుమ కూడా మావోయిస్టులు వెనకడుగు వేయడం లేదు. తాజాగా పార్టీ కీలక నిర్ణయం తీసుకుని కొత్త ప్రధాన కార్యదర్శిని ప్రకటించింది.
ఈ ఏడాది మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించిన విషయం తెలిసిందే. ఆ ఖాళీని భర్తీ చేస్తూ, తిరుపతి అలియాస్ దేవ్ జిని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మరోవైపు గెరిల్లా సుప్రీం లీడర్ మాడవి హిడ్మాకు బస్తర్ కమాండర్ బాధ్యతలు అప్పగించారు.
తిరుపతి నేపథ్యం: తిరుపతి స్వస్థలం తెలంగాణలోని కోరుట్ల అంబేద్కర్ నగర్. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్‌యూ) భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. అదే సమయంలో విద్యార్థి సంఘాల ఘర్షణల్లో చిక్కుకొని, పోలీస్ కేసులు ఎదుర్కొన్నాడు. అదే ఏడాది చివర్లో అజ్జాతంలోకి వెళ్లాడు. దళ సభ్యుని స్థాయి నుంచి ప్రారంభించి కమాండర్‌గా, తరువాత సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగాడు. మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా తిరుపతి పేరుప్రఖ్యాతులు సంపాదించాడు.
కేంద్రం లక్ష్యం:2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్రం వేగంగా కదులుతోంది. లొంగిపోయి ప్రధాన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తూ, ఇప్పటివరకు పలువురిని పునరావాసం కల్పించింది. కొంతమంది మావోయిస్టులను అరెస్ట్ కూడా చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గిపోయినా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఇంకా ఎక్కువగా ఉంది.
ఆ ప్రాంతంలో భద్రతా దళాలు భారీగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికభాగం ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా, తిరుపతి అలియాస్ దేవ్ జిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం మావోయిస్టు కూటమి మానసిక ధోరణిని ప్రతిబింబిస్తున్నదని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
