కాఠ్మాండూ, సెప్టెంబర్ 10 నవభూమి ప్రతినిధి : నేపాల్‌లో యువత చరిత్ర సృష్టించింది. ప్రజాభీష్టానికి విరుద్ధంగా నడుస్తున్న ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి ప్రభుత్వాన్ని జెన్ జడ్ నిరసనలతో కూలదోసింది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు చివరకు ఫలించి, ప్రధాని ఓలి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓలి విదేశాలకు పారిపోవాలనుకునే స్థితి నెలకొనగా, దేశ యువత తమకు నచ్చిన నాయకత్వాన్ని కోరుతూ ముందుకొచ్చింది.
ఈ క్రమంలో నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీని మధ్యంతర ప్రభుత్వానికి నాయకురాలిగా నియమించాలని జెన్ జడ్ సంఘాలు బహిరంగంగా డిమాండ్ చేశాయి. కాఠ్మాండూలో ఉధృతంగా సాగిన నిరసనల తరువాత ఇప్పుడు పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. ఓలి రాజీనామా అనంతరం యువత ఆగ్రహం తగ్గి, దేశంలో శాంతి వాతావరణం నెలకొంటోంది.
అయితే ఆందోళనలలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియా నిషేధం, అవినీతి పెరుగుదల, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలు నిరసనలకు ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2016 నుంచి 2017 వరకు నేపాల్ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కార్కీ పనిచేశారు. అవినీతి, భ్రష్టాచారానికి ఎదురు నిలిచి ప్రజల మన్ననలు పొందారు. ఆమెపై 2017లో మావోయిస్టు సెంటర్, నేపాలీ కాంగ్రెస్ పార్టీలు మహాభియోగ తీర్మానం తీసుకువచ్చినా, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమె విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆ ధైర్యవంతమైన పోరాటం కారణంగానే ఇప్పుడు ఆమె యువతలో విశ్వాసాన్ని కలిగించే నాయకురాలిగా నిలిచారు. జెన్ జడ్ తరగతి ఆమెను మధ్యంతర ప్రభుత్వానికి నాయకురాలిగా చూడాలన్న తపనతో ముందుకొచ్చింది.
