హైదరాబాద్”, సెప్టెంబర్ 10 నవభూమి ప్రతినిధి : ప్రముఖ మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు బుధవారం మధ్యాహ్నం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంతోషం నెలకొంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు దంపతులను అభినందిస్తుండగా, అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
కొణిదెల మూడో తరంలో ఇప్పటివరకు అమ్మాయిలే పుట్టగా, ఈసారి పుట్టిన బాబు ప్రత్యేకత సంతరించుకున్నాడు. చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజలకు అమ్మాయిలే పుట్టారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూడా క్లీంకార అనే పాప పుట్టింది. ఈ నేపథ్యంలో మెగా మూడో తరానికి తొలిసారిగా అబ్బాయి పుట్టడం విశేషంగా మారింది. అందుకే ఈ చిన్నారి రాకపై అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా జన్మించిన బాబును చూసేందుకు చిరంజీవి కూడా షూటింగ్ మధ్యలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. తన మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. నాగబాబు–పద్మజ దంపతులు నాన్నమ్మ, తాతయ్యలుగా మారిన ఆనందంలో బాబుతో కలిసి ఫోటోలు దిగారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరి వివాహం జరిగింది. కొంతకాలం క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ ఆనంద క్షణం నెరవేరింది. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన ఈ దంపతులు మెగా మూడో తరానికి ప్రత్యేక వారసుడిని అందించారు.


”