లండన్, సెప్టెంబర్ 10 నవభూమి ప్రతినిధి :: బ్రిటన్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీసా గడువు ముగిసినా తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకోవడంలో సహకరించని దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్, నైజీరియా పేర్లు ఉండటంతో ఆయా దేశాల పౌరులకు వీసాలపై ఉక్కుపాదం మోపనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో బ్రిటన్ హోం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్న లేబర్ పార్టీ నేత యెవెట్ కూపర్ ఈ విషయాన్ని ఘాటుగా స్పష్టం చేశారు.
అక్రమ వలసదారుల నియంత్రణలో భాగంగా ‘రిటర్న్స్’ ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని బ్రిటన్ పట్టుదలతో ఉంది. ఈ ఒప్పందాల ప్రకారం, వీసా గడువు ముగిసిన వారు లేదా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన తమ పౌరులను ఆయా దేశాలు తిరిగి స్వీకరించాలి. అయితే, భారత్ సహా కొన్ని దేశాలు ఈ విషయంలో పూర్తిగా సహకరించడం లేదని బ్రిటన్ ఆరోపిస్తోంది. అందుకే వీసా విధానాన్ని ఒక బేరసారాల అస్త్రంగా వాడాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది.
తమ పౌరులను వెనక్కి తీసుకోవడంలో భారత్ ఆలస్యం చేస్తే ముందుగా వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచడం, వీసా పరిశీలన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, చివరి అస్త్రంగా వీసాలను నిలిపివేయడం వంటి చర్యలకు వెనుకాడబోమని యూకే అధికారులు చెబుతున్నారు.
బ్రిటన్ హోం ఆఫీస్ గణాంకాల ప్రకారం వీసా గడువు ముగిసినా దేశంలోనే ఎక్కువ మంది ఉండిపోయిన వారిలో భారతీయులే అధికం. 2020 నాటికే దాదాపు 20,706 మంది భారతీయులు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా. గత ఏడాది భారత్ సుమారు 7,400 మందిని వెనక్కి తీసుకున్నప్పటికీ, పాస్‌పోర్టులు లేని వారిని గుర్తించి అత్యవసర ప్రయాణ పత్రాలు జారీ చేయడంలో భారత ప్రభుత్వం జాప్యం చేస్తోందని యూకే ఆరోపిస్తోంది.నిపుణుల అంచనాల ప్రకారం యూకే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంటే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాణిజ్యం, విద్య, ఉద్యోగాల రంగాల్లో ఇరు దేశాలు బలమైన భాగస్వామ్యాలు కలిగి ఉండటంతో ఈ నిర్ణయం సంబంధాలను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మైగ్రేషన్ అబ్జర్వేటరీకి చెందిన డాక్టర్ పీటర్ వాల్ష్ మాట్లాడుతూ, “యూకే వీసా వ్యవస్థను అత్యధికంగా వినియోగించుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ విధమైన బెదిరింపును భారత్ తేలికగా తీసుకోదు. ఇరు దేశాల సంబంధాలపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది” అని అభిప్రాయపడ్డారు.యెవెట్ కూపర్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ, అవసరమైతే ఏ దేశానికైనా వీసాలను ఆయుధంగా వాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో బ్రిటన్‌లో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకుంటున్న లక్షలాది భారతీయుల్లో ఆందోళన పెరిగింది.