అమెరికాను దాటేయనున్న భారత్.. 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..! అంచనాలివే..

GDP Growth India: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో అద్భుతంగా దూసుకెళ్తోంది. ఇక 2038 నాటికి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నట్టు ఈవై రిపోర్ట్ వెల్లడించింది. పీపీపీ టర్మ్స్ అంటే కొనుగోలు శక్తి సమానత్వంలో ఈ క్రమంలో అమెరికాను కూడా భారత్ దాటనున్నట్లు అంచనా వేసింది.

EY Report 2025 : భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2038 కల్లా ఏకంగా 34.2 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని ఈవై రిపోర్ట్ వెల్లడించింది. ఇక్కడ కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రామాణికత ఆధారంగా చూస్తే.. 2030 నాటికి 20.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని బుధవారం రోజు అంచనా వేసింది. ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనాల్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కగట్టింది ఈవై రిపోర్ట్. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. 2028-2030 మధ్య భారతదేశం, అమెరికా సగటు వృద్ధి రేటు 6.5 శాతం, 2.1 శాతం వద్ద ఉన్నట్లయితే.. 2038 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా భారతదేశం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించవచ్చు అని ఈ నివేదిక తెలిపింది. జీడీపీ పరంగా చూస్తే ప్రస్తుతం భారత్.. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది.

కొద్ది రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. ఒకవైపు భారత్‌పై సుంకాల్ని భారీగా పెంచిన ట్రంప్ 50 శాతానికి చేర్చారు. మరోవైపు.. పెనాల్టీ కూడా విధిస్తున్నారు. ఇదే సమయంలో ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసుకుంటున్నాయని.. పతనం దిశగా పయనిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే ఈవై రిపోర్ట్ చర్చనీయాంశంగా మారింది.