చిరు వర్సెస్‌ బాలయ్య

జూబ్లీహిల్స్‌ హోటల్లో సమావేశమైన చిరు ఫ్యాన్స్‌

బాలయ్యపై కేసులు పెట్టేందుకు సిద్ధమైన చిరు అభిమానులు

చిరంజీవిపై కేసులు పెడతామంటున్న బాలయ్య ఫ్యాన్స్‌

హడావుడిగా చేరుకున్న చిరు..కేసులు వద్దని హితవు

బాలయ్య క్షమాపణ చెప్పేవరకు ఆపబోమన్న ఫ్యాన్స్‌

చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత నిర్ణయమన్న చిరు

గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌తో టాలీవుడ్‌ పరిశ్రమ సమస్యలపై జరిపిన చర్చల సందర్భంగా అగ్ర హీరోలకు అవమానం జరిగిందంటూ బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన ఆరోపణలపై చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో తెలుగు రాష్ట్రాల్లో 300 పోలీసు స్టేషన్లలో బాలకృష్ణపై కేసులు పెట్టాలన్న నిర్ణయానికి చిరంజీవి ఫ్యాన్స్‌ వచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ సమీపంలో చిరు అభిమానులు సమావేశమయ్యారు. బాలయ్యపై కేసులు పెట్టాలన్న తీర్మానం చేశారని తెలిసిన చిరంజీవి హుటాహుటిన హోటల్‌కు చేరుకొని వద్దంటూ వారించినట్లు తెలిసింది. ఏపీలో కూటమిలో భాగస్వామ్య పక్షమైనందు వల్ల సీఎం చంద్రబాబుతో చర్చించిన మీదటే నిర్ణయం తీసుకుందామని నచ్చ జెప్పినట్లు తెలిసింది. అయితే బాలకృష్ణ క్షమాపణ చెప్పేవరకూ తాము ఆందోళన చేస్తామని అభిమానులు మెగాస్టార్‌కు చెప్పారని తెలుస్తోంది. ఇటు వైపు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై కేసులు పెడుతున్నారని తెలియగానే బాలకృష్ణ అభిమానులు స్పందిస్తున్నారు. బాలయ్యపై కేసులు పెడితే, అంతేస్థాయిలో తాము పోలీసుస్టేషన్లల్లో కేసులు పెడతామని హెచ్చరించినట్లు వినిపిస్తోంది. 

చిరంజీవికి మద్దతుగా పలువురు నటులు నిలుస్తున్నప్పటికీ, బాలయ్య మాత్రం తాను అసెంబ్లీలో చేసిన వాదనకు కట్టుబడి ఉన్నట్టేనని చెబుతున్నారు. క్షమాపణ చెప్పేదేలేదని అంటున్నారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మధ్యవర్తిత్వం వహిస్తారని వినిపిస్తోంది. ఆయన స్వయంగా బాలయ్యతో మాట్లాడే అవకాశం ఉంది. జ్వరం తగ్గిన వెంటనే పవన్‌ తన ‘ఓజీ’ సినిమాను మెగా బ్రదర్‌ అండ్‌ ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా చిరు,పవన్‌ మధ్య బాలయ్య వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు తాను బాలయ్యతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.