CPLలో ఒక్క బంతికి 22 పరుగులు.. నీకో దండంరా బౌలరూ! వీడియో ఇదిగో.. ఇతనికి ఇదేం కొత్త కాదంట గురూ!!

ఒక్క బంతికి మహా అయితే ఎన్ని కొడతారు.. మామూలుగా మాట్లాడితే సిక్సర్ ఒకటి కొడతారు! నో బాల్ అయితే ఫ్రీ హిట్‌తో కలిసి రెండు సిక్స్‌లు బాదితే 13.. కానీ ఇక్కడ ఓ బౌలర్ ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు. ఇదేదో గల్లీ క్రికెట్‌లో అని మాత్రం అనుకోకండి. ప్రపంచ స్థాయి క్రికెటర్లు ఆడే టీ20 లీగ్‌లో.. అది కూడా టీ20 మాన్‌స్టర్స్ వెస్టిండీస్ ప్లేయర్లు ఆడే చోట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇదే బౌలర్ 2024లో ఒక బంతికి 15 పరుగులు ఇచ్చాడు.

కరీబియన్ టీ20 లీగ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ షాకయ్యే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక లీగల్ డెలివరీకి ఏకంగా మూడు సిక్స్‌లు. నమ్మడానికి కాస్త కష్టమైనా.. నమ్మి తీరాల్సిందే. డారెన్ సామీ స్టేడియం వేదికగా జరిగిన గయానా అమెజాన్ వారియర్స్ వర్సెస్ సెయింట్ లూసియా కింగ్స్ మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది.

వెస్టిండీస్ బౌలర్ ఒషేనా థామస్ వేసిన ఓవర్‌లో ఆర్సీబీ స్టార్ రొమారియో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒక్క బంతికే 22 పరుగులు ఇచ్చిన థామస్, ఆ ఓవర్‌లో మొత్తం 33 పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా మూడు నో బాల్స్ వేసి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించాడు. గల్లీ క్రికెట్‌లో కూడా ఇలా వేయలేరంటూ ఈ ఇంటర్నేషనల్ బౌలర్ నిరూపించాడు.